కొన్ని వింతైన విషయాలు:
సాధారణముగా పొరపాటున వేలు కోసుకుంటే మనకు చాల బాధ వేస్తుంది. కాని ఒక కుటుంబంలో ఒక మనషి పోయినప్పుడల్లా ఒక వేలును కత్తిరిస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఇండోనేషియాలో షాపువ తెగ ప్రజలు చనిపోయిన వారి ఆత్మలు ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలను పట్టిపీడిస్తాయని అంత్యక్రియలలో భాగంగా అమ్మాయిల వేళ్ళని కత్తిరిస్తారు. కొందరు మరణిస్తే బాధ ఉంటుంది. కాని ఆ బాధను శారీరకంగా అనుభవిస్తే ఇంకా ఏడుపు వస్తుందని వేళ్ళు కత్తిరించు కుంటారు మరికొందరు. ఆధునిక పరిజ్ఞానముతో చాల వరకు ఈ మూడనమ్మకము తగ్గుముఖము పట్టిన్నప్పటికి ఈ దేశములో చాలా మంది ముసలి వాళ్ళకు వేళ్ళు ఉండవు.
సాధారణముగా చెట్టు గాలి వానకు పడిపోతే ప్రక్కకు తప్పిస్తాము. కాని కాలిఫోర్నియాలోని సేక్యోయియా నేషనల్ పార్కు లో గాలి వానల తాకిడికి ఓ చెట్టు పడిపోయింది. అది దాదాపు ఎనిమిది మీటరుల వెడల్పు మరియు 85 మీటరుల ఎత్తు ఉన్న రెడ్ వుడ్ చెట్టు అయ్యేసరికి దానిని ప్రక్కకు తొలగించడము ఇబ్బంది కావటము వల్ల దానిలోనించి సొరంగ మార్గం చేసారు. ప్రపంచములోని అతి పెద్ద చెట్ల జాతికి సంబంధించిన చెట్టు ఇది. ఈ సొరంగమార్గం చేసి ఇప్పటికి సుమారుగా 75 సంవత్సరాలు అయినది. ఇప్పటికి ఈ చెట్టు సొరంగము చెక్కుచెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఈ చెట్టు వయస్సు సుమారుగా 2000 సంవత్సరాలు ఉంటుందని అంచనా.
తిరుమలలో ఉత్సవాలలో ఉత్సవ విగ్రహాలను మోయుటకు మరియు ఇతర పూజ విధానాలలో ఏనుగులను సాధారణముగా ఉపయోగిస్తారు. తమిళనాడు లో మదురై ఉన్న మీనాక్షి ఆలయము మరియు ఇతర ఆలయాలలో ఉన్న ఏనుగులకు వాటి పనితనానికి విలువను ఇస్తూ వాటికి సుమారుగా 48 రోజులు విశ్రాంతి సెలవులు ఇస్తారు. ఈ సెలవు దినాలలో వాటిని అక్కడ దగ్గర ఉన్న ముడుములయ్ నేషనల్ పార్కుకు తీసుకువెళతారు. అచ్చట కొత్త మావటి వాళ్లకు శిక్షణ ఇవ్వటానికి ఉపయోగిస్తారు.