భారతదేశములోగల పుణ్య క్షేత్రాలలో కాశి(వారణాసి) అత్యంత ప్రముఖమైనది. కాశి భారతదేశములో ఉత్తరముగా ఉంటే దక్షిణమున ఉన్న శ్రీకాళహస్తి దక్షిణకాశిగా పిలవబడుతూ అంతే ప్రముఖస్థానం పొంది ఉంది. ఇక్కడ కొలువై ఉన్నవాడు లయకారుడైన శివుడు. ఆ దేవదేవుడు ఇక్కడ శ్రీకాళహస్తీశ్వరుడుగా ప్రజల చేత పిలవబడుతున్నాడు. ఇచ్చట శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది. లింగమునకు ముందు ఉన్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెప రెప లాడుతూ ఉంటుంది. అందుకే ఈ స్వామి వాయులింగేశ్వరుడిగా ప్రసిద్దుడు. అంతే కాదు ఇచట స్వామి స్వయంభువు, అనగా తనంతట తనే వెలసినవాడు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ గా కొలవబడుతుంది. హిందువులు విధిగా దర్శించవలసిన ఈ క్షేత్రము తిరుపతికి నలభై కిలోమీటర్లు దూరములో ఉంది. ఈ సుందర దేవాలయము సువర్ణముఖి నది పక్కన ఉన్నది.
బ్రహ్మకు జ్ఞానము ప్రసాదించిన ప్రదేశముగా ఈ క్షేత్రము భావించబడుతుంది. స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రమునకు ఈ పేరు రావడానికి కారణము ఇలా వివరించబడుతుంది.
శ్రీ అంటే సాలెపురుగు. కాల అనగా కాల సర్పము. హస్తి అనగా ఏనుగు. స్వయంభువుగా అరణ్య మధ్యమున వెలసిన శివ లింగమును ఒక సాలెపురుగు, ఒక సర్పము, ఒక ఏనుగు భక్తితో తమ తమ పద్దతులలో విడివిడిగా పూజిస్తూ ఉండేవి. సాలెపురుగు గూడును అల్లేది. పాము మణితో లింగమును అలంకరించేది. ఏనుగు నీటితో లింగమును శుభ్రము చేసి బిల్వ పత్రములను ఉంచి పూజించేది. ఇలా జరుగుతుండగా తమ పూజను ఎవరో పాడుచేస్తున్నట్లుగా మూడూ భావించేవి. ఒక సమయమున మూడూ ఒకదానికోసం ఒకటి కాపు కాసి కలహించుకుని మరణించాయి. వాటి భక్తికి, త్యాగమునకు సంతసించిన శంకరుడు వాటిని ఆశీర్వదించి ముక్తిని ప్రసాదించాడు. ఆ నాటినుండి ఆ పవిత్ర క్షేత్రము వాటి పేర్ల మీదుగా శ్రీకాళహస్తి అను పేరును ధరించినది.
ఈ స్వామిని అర్చించిన కన్నప్ప కథ కూడా ఎంతో ప్రసిద్ధము. తిన్నడు(కన్నప్ప) అనే గిరిజనుడు అడవిలోని జంతువులను వేటాడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కన్నప్ప స్వామిని తన మోటు పద్దతులలో మాంస ఖండములతో అయినా నిండు భక్తితో పూజిస్తూ ఉండేవాడు. ఒక నాడు శివలింగము నుండి రక్తము కారడము తిన్నడు చూశాడు. 'అయ్యో.. నా స్వామి కంటికి ఏదో అయినది ' అనుకుని అ అమాయక భక్తుడు తన చేతి బాణముతో తన కంటిని పెకలించి లింగమునకు అమర్చాడు. అతనిని పరీక్షించదలచిన మహా శివుడు మరొక కంటి నుంచి కూడా నెత్తురు కార్చాడు. ధీరుడైన ఆ భక్తుడు తన మరొక కంటిని కూడా పెకలించి స్వామికి అమర్చాడు. ఆ భక్తి విశ్వాస త్యాగములకు పరవశుడైన మహా శంకరుడు కన్నప్పకు శివ సాయుజ్యం ప్రసాదించాడు. దేవాలయమునకు దగ్గరలో గల కొండపై కన్నప్పకు చిన్న గుడి ఉంది. అది తప్పక చూడవలసినదివారణాశీలో వలే ఇక్కడ మరణించే పుణ్యాత్ములకు శివుడు ముక్తిని ప్రసాదిస్తాడని జనుల నమ్మకం.
ఆది శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ క్షేత్రమును ప్రతిష్టించారు. ఈ క్షేత్రమున పర్యటించడము చాలా పుణ్య కార్యము.
శ్రీకాళహస్తీశ్వరాలయము ఎంతో ప్రాచీనమైంది. చాలా పెద్దది. ఇది అద్బుతమైన కట్టడము. ఇక్కడ శిల్పకళ మహాద్బుతంగా ఉండి చూసిన వారిని చకితుల్ని చేస్తుంది.
ఇక్కడ మహాశివరాత్రి ఎంతో కన్నుల పండువగా విపరీతమైన జనసందోహంతో జరుగుతుంది. ఈ క్షేత్రములో రాహు కేతు దోష నివారణ పూజలు ప్రత్యేకము. అందు కోసమై దేశపు నలుమూలల నుంచి భక్తులు వస్తారు.
ఆలయ నిర్మాణం మొదటగా అతి ప్రాచీన కాలంలోనే ప్రారంభమైనట్లుగా తెలుస్తున్నది. ఆధారాలు మాత్రం ఐదవ శతాబ్దం నుండి దొరుకుతున్నాయి. పల్లవులు ఐదవ శతాబ్దంలో స్వామి వారి అర్చన కోసం ప్రారంభ కట్టడాన్ని నిర్మిచినట్లుగా తెలుస్తోంది. తర్వాట ఆలయ నిర్మాణం అనేక సమయాల్లో అనేక మంది రాజుల చేత అభివృద్ది చేయబడినట్లుగా ఆధారాలు దొరుకుతున్నాయి. పదవ శతాబ్దంలో చోళులు, పన్నెండవ శతాబ్దంలో వీర నరసిం హ యాదవరాయలు, పదిహేనో శతాబ్దంలో విజయనగర రాజైన శ్రీ కృష్ణ దేవరాయలు మొదలైన మహారాజులచే శ్రీకాళహస్తీశ్వరాలయం పరమ భక్తితో, ఆద్భుతంగా అభివృద్ది చేయబడింది, అనాది కాలం నుండి తరతరాలుగా కొలువబడుతున్న ఈ మహా శివ లింగాన్ని దర్శించాలంటే ప్రశాంతమైన మనసుతో శ్రీకాళహస్తికి చేరుకోవలసిందే.