వార్తయనగా వృత్తాంతము లేక జరిగిన విషయమని అర్ధము. ఒక చోట జరిగిన దాని వివరములను వార్తాపత్రికలందురు. కొన్ని శతాబ్దములకు పుర్వమొకచోట జరిగిన సంఘటణ వార్త ఆనోట ఆనోట పడి దేశమంతట తెలియుటకు కొన్ని సంవత్సరములు పట్టేడిది. కాని కొన్ని శతాబ్దముల యనుభవము వలన కొన్ని ముఖ్య విషయములను గోడలపై వ్రాసి తెలుపుచుండెడివారు. క్రమముగా గత శతాబ్దమునందు ముద్రణా యంత్రము లవతరించుటకై పాశ్చాత్య దేశములందు వార్తాపత్రిక ప్రచురణ ప్రారంభమైనది. తదుపరి ప్రభుత్వ శాసనములను వెల్లడించుటకు "గెజిట్" ప్రచురణ మొదలైనది. క్రమక్రమముగా వ్యాపార దృష్టిఏర్పడి వార్తాపత్రిక ప్రచురణ నేటికి పెద్దపరిశ్రమగా మారి ప్రపంచము నందు ప్రబలశక్తిగా రూపొందినది.
వార్తాపత్రికలో దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక, సంవత్సర ప్రచురణ గలిగినవి వేరువేరుగా నున్నవి. ఇంగ్లీషు, హిందీ, ఉరుదూ, తెలుగు, తమిళము మొదలగు నాగరిక భాషలలో ప్రచురించబడు ఈ పత్రికలన్నియు స్వదేశములోను, విదేశములందును నిత్యము జరుగు సంఘటనల వార్తలను విలేఖరులద్వారా సేకరించి ప్రచురించు చుండును. ప్రభుత్వ కార్యకలాపములు, చట్టములు, రాజకీయోద్యమములు, సమ్మెలు, పరిశ్రమలు, రవాణా సాధనములు ఆరోగ్యవైద్య విషయములు, విద్యా సమస్యలు, వైజ్ఞానిక పరిశోధనలు, వర్తక వానిజ్యములు, వ్యవసాయ పశుపోషణ, క్రీడావినోదములు మొదలగు పెక్కు విషయములు దిన పత్రికలలో ప్రముఖముగా వేలుపడుచుండును. వీనికి ఆదివారమునాడు, పండుగ దినములందు ప్రత్యేక సంచికలు గూడ ప్రచురింపబడుచుండును వారపత్రికలందు విశేషముగా సాహిత్యమునకు, శాస్త్రములకు, విమర్శకులు స్థానమిత్తురు. కధలు, నవలలు, గ్రంథ విమర్శలు పాఠకుల నాకర్షించును. మాసపత్రికలు, త్రైమాసిక పత్రిక లధికముగా వివిధ వృత్తులకు, పరిశ్రమలకు, శాస్త్ర రంగాలకు చెందియుండును.
ఈనాటి ప్రపంచమందు అధిక ప్రజాప్రచారం కలిగిన సాధనములందు పత్రికలకు అగ్రస్థానము గలదు. ఇవి వివిధ విషయాలను సేకరించి ముద్రించి స్వల్ప మూల్యమునకే వివరములను అందించుటకు వలన విరివిగా ప్రజామోదము చూరగొని మహానగారముల నుండి మారుమూలలోని పల్లెలకు కూడా వ్యాపించి ప్రజలకు జాతీయాంతర్జాతీయ పరిస్థితులను తెలుపుచున్నవి. దీనివలన పౌరులు ప్రభుత్వ విధానాలను ప్రణాళికలను, శాసనాలను చక్కగా తెలిసికొని తమ విధ్యుక్త ధర్మములను నేరవేర్ప గలుగు చున్నారు. కాలక్షేపముతో బాటుగా విజ్ఞాన్నాన్ని పెంచుకొని తమ శక్తిసామర్ధ్యాల నినుమడింప జేసికొనుచున్నారు. తమ పాఠకులకన్ని తరహాల వారికి సంతృప్తి కలుగునట్లుగా వార్తా పత్రికలు వివిధ శీర్షికలతో వార్తలు, వ్యాసాలు ప్రకటించి తోడ్పడుచున్నవి. వర్తకులు, రైతులు, విద్యార్ధులు, స్త్రీలు, బాలలుకూడా చదువుకోనదగిన వానిని ప్రకటించుచున్నవి. పత్రికలు చదువుట నేడు నిత్యకృత్యములలో ఒకటైనది. దానిపై ప్రతినెల కొంత ఖర్చు చేయుట కెవ్వరును వెనుకంజ వేయుటలేదు. వార్తాపత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య దూతలవలె నున్నవి. పరస్పరాభిప్రాయములను అందిచుచున్నవి. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలుపుచున్నవి.
వెలుగు వెనుక నీడయుండునట్లు మంచి ననుసరించు చెడుకూడ నుండును. ప్రపంచ ప్రజలకెంతో మేలుచేయుచున్న ఈ పత్రికలు పెట్టి ధనికుల, వర్తకుల చేతిలో బందీలై పక్షపాత బుద్దితో ఒక రాజకీయ పార్టీకో, మతానికో, వర్గానికో, వృత్తికో అనుకూలముగా వ్రాసి ప్రచారం చేయుచూ, తదితరులపై దుష్ప్రచారం చేయుట జగద్విదితమే. ఇందు వలన రాజకీయ విషమ్యాలు, ఆందోళనలు, సమ్మెలు పెరుగుచున్నవి. ఉత్తరప్రదేశ్, బీహారు, గుజరాత్, కాశ్మీరువంటి రాష్ట్రాలలో కుల మత వర్గ కలహాలు ప్రబలుచున్నవి. మోసపు ప్రకటనలు, బూటకపు వార్తలు ప్రజలను తప్పుదారి, పట్టించి ప్రలోభపరిచి దోపిడీకి గురి చేయుచున్నవి. అసభ్యములు, ఆశ్లీలములైన కథలు, చిత్రాలు ప్రచురించి కొన్ని పత్రికలు డబ్బు చేసుకోనుటే లక్ష్యంగా పెట్టుకొన్నవనుట నిర్వివాదము. ఇందువలన అనేకులు భాష్టులై నిర్వీర్యులగుచున్నారు. ఉద్రేకము, ఆవేశము పుట్టించి రెచ్చగొట్టు వ్రాతంతో మరికొన్ని ధనము గడించుట శోచనీయము. ఇట్టి దానిని చక్కదిద్దుట కొరకై ప్రభుత్వం "ప్రెస్ కమిషన్"ను ఏర్పాటుచేసి కట్టుదిట్టములు చేసినది. దురదృష్టవశమున ౧౯౭౫ జూన్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు వార్తాపత్రికలపై ఆంక్షలను విధించుట జరిగినది. దానితో వాస్తవాలు వేలికిరాక ప్రభుత్వ చర్యలను విమర్శించువారు కరువైనారు.
ఈ పరమ సత్యమును గుర్తించి వార్తాపత్రికలు నిజాయితీతో నిష్పక్షపాత ద్రుష్టినవలంభించి వాస్తవాలను జాతీయ సంక్షేమానికై తెలుపవలెను. దేశ పురోగమనంలో ప్రముఖపాత్ర వహించి జీతీయాభ్యుదయము సాధించవలెను. వార్తాపత్రికలు ప్రజల మనోభావాలకు దర్పనములని నేరుపించవలెను.