సునామి అనగానే 2004 సంవత్సరం గుర్తుకు వస్తుంది. 2004 డిసెంబర్ 26 తేదిన అనగా ఆదివారం తెల్లవారు జామున ఇండోనేషియాలో సుమత్రా దీవుల పశ్చిమ తీరంలో సముద్ర గర్భంలో రేగిన భూకంపాల పరంపర సునామి రూపంలో మొత్తం హిందూ మహాసముద్ర తీర దేశాలన్నింటిని కదిలించివేసింది. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్ లాండ్ మరియు సోమాలియాలతో సహా మొత్తం 14 దేశాలలో సుమారు 230000 మందిని సునామి పొట్టన పెట్టుకుంది. సుమారు 30 కిలోమీటర్లు లోతులో సముద్రంలో సంభవించిన భూకంప పరిణామాలు సముద్ర కెరటాలు 30 అడుగుల ఎత్తున ఎగిరేటట్లు చేశాయి. తద్వారా తీర ప్రాంతాలు అన్ని నేలమట్టం అయ్యాయి. ఆ భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై అప్పట్లో 9 .1 గా నమోదైయ్యాయి. అప్పట్లో ఆ భూప్రకంపనలు 8 .3 నుండి 10 నిమిషాలు వరకు కొనసాగాయి. ఇటువంటి భూకంప తీవ్రతకు భూగోళం అంతా 1 నిముషం పాటు కంపించిపోయింది. అలస్కా వంటి దూర ప్రాంతంలో, మన దేశంలో తమిళనాడు తీర ప్రాంతంలో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్ మరియు మయన్మార్ వంటి దేశాల్లో కూడా జరిగిన అపారనష్టంను అంచనా వేయడం అప్పట్లో కష్టమైపోయింది. మన దేశంలో ఏడు చోట్ల అప్పట్లో సముద్రంలో పోటెత్తింది. ఆగ్నేయ మరియు దక్షిణాసియా దేశాలలో ప్రజలు హాహాకారాలు చేశారు. మన రాష్ట్రమే కాకుండా తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో మృత్యు తాండవం జరిగింది. అప్పట్లో దాదాపు 13000 ఘోర మరణంకు గురి అయినట్లు అధికారికంగా ధ్రువీకరించినారు. జపాన్లో హిరోషిమాపై అణుబాంబు ప్రమాదం కంటే దాదాపు 1500 రెట్లు అధికమని అంచనా వేయడమైనది.
అయితే అప్పట్లో జరిగిన సునామీని ముందుగా గుర్తించలేక పోవడమనేది ప్రధాన లోపం ఎందుకంటే ఇండోనేషియా తీరంలో సంభవించిన తొలి భూకంపానికి, సునామి ఉత్పాతానికి మధ్య చాల గంటల వ్యవధి ఉన్నా ఈ కల్లోలం మన దేశం వరకు వచ్చే వరకూ ఎవరు పసిగట్టలేదు. హిందూ మహాసముద్రంలో ఈ ముప్పును గుర్తించే మరియు హెచ్చరించే యంత్రాంగం మరియు వ్యవస్థ లేవి లేక పోవడం వల్ల సునామిని గుర్తించలేకపోవడం జరిగింది.
నిజానికి సునామిని గుర్తించాలంటే అంత సులభం కాదు. ఎందుకనగా సునామీని గుర్తించుటకు ఎంతో సున్నితమైన సేన్సర్లు అవసరం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే భూకంపం జరిగిన కేంద్ర ప్రాంతం నుండి కొన్ని వేల కిలోమీటర్లుకు సునామి జరగవచ్చు. అయితే సునామి వచ్చేముందు అనగా కొన్ని నిముషాల ముందు సముద్ర తీరం చాలా కిలోమీటర్లు లోపలి వెళుతుంది. అంతలోనే ఒకేసారి పెను ఉద్ధృతితో ఉప్పెనలాగా భీకరంగా అలలతో జలప్రలయంను తలపిస్తూ తీర ప్రాంతంల మీదకు దూసుకెలుతుంది. దీనిని అనుభవంగా సునామీని గుర్తించే యంత్రాంగం యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలు 2004 తర్వాత గుర్తించాయి. 2004 నాటికి అమెరికా సునామీని గుర్తించ గల్గినా ఏ దేశానికి ఆ విషయాన్ని తెలియజేయాలో తెలియకపోవటం వల్ల తీవ్ర నష్టం జరిగిందని వాపోయింది. దీని వల్ల ఐక్యరాజ్యసమితి " హిందూ మహా సముద్ర సునామి హెచ్చరికల యంత్రాంగం" ని నెలకొల్పేందుకు గట్టిగా కృషి చేసింది.
2006 నాటికి ఇది ఒక రూపాన్ని సంతరించుకొని, యునెస్కో సారథ్యంలో 25 సిస్మోగ్రాఫిక్ వీశాట్ కేంద్రాల అనుసంధానంగా 26 దేశాలలో జాతీయ సునామీ కేంద్రాలకు సమర్ధవంతంగా సమాచారం అందించే విధంగా యంత్రాంగం రూపుదిద్దుకొంది. పసిఫిక్ మహా సముద్రంలో "పసిఫిక్ సునామి వార్నింగ్ సెంటర్" ను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. సునామీల విషయంలో సులువైన అంశమేమిటంటే వీటిని ముందుగా పసిగడితే ముందస్తు సురక్షిత చర్యలు తీసుకొనేందుకు కొంత సమయం ఉంటుంది.
2004 సునామి అనంతరం శాస్త్ర సాంకేతిక రంగాలు వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం అయ్యాయి. దీనిలో భాగంగా సునామి ఆనవాళ్ళను గుర్తించే సెన్సర్ నెట్వర్క్, అంతర్జాతీయంగా శాటిలైట్ తో నిరంతరం నిఘా, సరియైన సమయంలో వాటిని విశ్లేషించే నిపుణుల బృందం, తదనుగుణంగా సునామి హెచ్చరికలు జారీ చేసే యంత్రాంగం, స్పదించే బృందాలు తద్వారా ప్రజలలో కల్గించే చైతన్యం ఈవన్ని 2012 , ఏప్రిల్ 11 రోజున ముందస్తు సునామి హెచ్చరికలను బట్టి ఆ దిశలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తుంది.