మనసు అనగానే మన తెలుగు వారి మనసులలో మెదిలేది.. 'మనసుకవి' ఆచార్య ఆత్రేయ!
తేట తేట తెలుగు పదాలతో గుండె లోతుల్లోని భావాలను కూడా అవలీలగా పలికించగలిగిన
ఒకే ఒక సినీ కవి ఆత్రేయ అంటే అతిశయోక్తి కాదేమో!
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులా
తేరులా సెలయేరులా కలకలా గలగలా
కడలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలిచింది కనుల ముందరా...
అంటూ తెలుగు కమనీయదానాన్ని ఒక అందమైన అమ్మాయికి అన్వయిస్తూ గమ్మత్తు
చేస్తాడు ఆత్రేయ. ప్రేమనగర్ చిత్రంలోని ఘంటసాల గళం నుండి జాలువారిన ఈ పాటకు
మహదేవన్ సంగీతం మరింత అందాన్నిచ్చింది. అందుకే ఈ పాట ఎప్పటికీ తెలుగు వారికీ
గర్వ కారణంగా నిలిచే ఉంటుంది!
కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతదీ
ఆ కుదుట పడ్డ మనసు తీపికళలు కంటదీ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ
ఆ కలలు కూడా దోచుకునే దొరలూ ఎందుకు!
మనిషి పోయిన దుఃఖం నుండి తేరుకోవడానికి ఓదారుస్తూనే నిదుర గురించి,
ఆ వెనుక ఉండే పెద్దవాళ్ళ అహంకారం గురించి ప్రశ్నించే నేర్పు ఆత్రేయకు
కాకుండా మరేవరికుంటుంది?!! మూగమనసులు చిత్రంలోని 'పాడుతా
తీయగా సల్లగా' అనే పల్లవితో మొదలయ్యే ఈ పాట
జోలపాటల్లో ఓ ప్రత్యేకమైన పాట. ఆర్ద్రతను, అనురాగాన్ని ఇముడ్చుకున్న
అద్భుతమైన పాట!
తలుపు మూసినా తలవాకిటిలో
పగలూ రేయీ నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులే రాకా
అలసి తిరిగీ వెళుతున్నా
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు
నను వలచావని తెలిస్తేలోగా నివురైపోతాను!
ప్రేయసి కోసం ఎదురు చూసి చూసి అమెనుండి ఏమీ బదులు రాక
చివరకు నిరాశగా వెనుతిరిగే ఒక ప్రియుడి ఆవేదనను ఇంతకన్నా
చక్కగా రాయాలంటే ఆత్రేయకే చెల్లు! 'ఇంద్రధనుసు' చిర్తంలోని
'నేనొక ప్రేమ పిపాసినీ' అనే ఈ పాట ఆత్రేయ అమూల్యగీతాల్లో
అత్యంత అపురూపమైనది!
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికనీ
అనుకోవడమే మనిషి పనీ
నీ సుఖమే నే కోరుకున్నా.... నిను వీడి అందుకే వెళుతున్నా...
అంటూ భగ్న ప్రేమికుడి ఆవేదనను తేటతెల్లం చేసిన "మురళీకృష్ణ"
చిత్రంలోని ఈ పాట తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన పాట!
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు!
మనసుపడే ఆవేదనను ఇంతకన్నా అందంగా ఆత్రేయ కాకుండా
మరెవరైనా రాయగలరా?? తప్పకుండా ఈ ప్రశ్నకు జవాబు
లేరు అనేకదా!
మరిన్ని మనసుకవి పాటలు మరోసారి! మీ రాజేష్!