హరప్పా సంస్కృతి మరియు వారి జీవన విధానం:
హరప్పా సంస్కృతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది సింధూ ప్రజల సంస్కృతి ఎందుకంటే హరప్పా ప్రాంతంలో సింధూ నది ప్రాంతం అందు నివసించిన ప్రజల సంస్కృతి కావున ఆ ప్రజల సంస్కృతి హరప్పా సంస్కృతి అయ్యింది. అయితే ఈ సంస్కృతి క్రీ.పూ.3000 ప్రాతంలోనే విలసిల్లినట్లు చరిత్ర కారులు చెపుతున్నారు. ఈ నాగరికత కేవలం హరప్పా, మొహంజదారో ల వద్దనే కాకుండా చంపుదారో, గుజరాత్ లోని లోథాల్, తోల్వీర రాజస్థాన్ లోని కాలిబంగన్ వంటి 250 ప్రదేశములలో బయల్పడినట్లు చరిత్ర కారులు వెల్లడి చేశారు. మొహంజదారో మరియు హరప్పా నగరాలలో రోడ్ల వెడల్పు సుమారు 3 మీటర్లు నుండి 10 మీటర్లు వరకు ఉంటుంది. వీరు భవనాలను సాధ్యమైనంతవరకు మెరక మీదనే కట్టేవారు. వీరు కాల్చిన ఇటుకలను నిర్మాణంలో వాడేవారు. ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే వీరి ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. పెద్ద పెద్ద ఇండ్లకు మరుగుదొడ్డి సౌకర్యం ఉండేది. సామాన్యుల ఇళ్ళు రెండు గదులు మరియు సంపన్నుల ఇళ్ళు ఐదు లేదా ఆరు గదులతో విశాలంగా ఉండేవి.
హరప్పా ప్రజలు పట్టణాలను నిర్మించడంలో గొప్ప నిపుణులు. వీరు నిర్మించిన వాటిలో మొహమ్జదారోలోని మహాస్నాన వాటిక విలక్షన్మైనది. దీనికి దక్షిణ దిక్కులో మెట్లను ఏర్పాటు చేశారు. ఒక బావి నుంచి దీని లోనికి నీటిని పంపే ఏర్పాటు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషమేమిటంటే వేడి నీటిని లోపలి వదిలే సౌకర్యం కూడా ఉంది. హరప్పాలో కట్టిన ధాన్యాగారం అనేది ప్రత్యేకంగా వీరిచే నిర్మింపబడింది. ప్రతి వీదిలో ఇటుకలతో మురుగు నీటి కాలువలు నిర్మించారు. అయితే ప్రపంచంలో ఈ మురుగు నీటి పారుదల సౌకర్యం వేరే ఇతర ప్రాచీన నగరాలలో కూడా లేదు. వీరి కాలంలో ప్రభుత్వ భవనాలను ఎత్తైన ప్రదేశాలలో, పౌర నివాసాలు తూర్పు పల్లపు ప్రాంతాలలో మరియు పశ్చిమాన ఎత్తైన ప్రాంతాలలో దుర్గాలను నిర్మించడం జరిగింది.
హరప్పా ప్రజలది మాతృ స్వామిక వ్యవస్థ అనగా వీరి వ్యవస్థలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబానికి సంబంధించి నిర్ణయాధికారం తల్లి చేతిలో ఉండేది. వీరికి ఇనుము అనే లోహం గురించి తెలియదు. వీరి ప్రాధాన వృత్తి వ్యవసాయం. పంటలు పుష్కలంగా వీరి కాలంలో పండాయి. గోధుమ, బార్లీ మరియు ప్రత్తి వీరి ప్రధానమైన పంటలు. పాలు, కూరగాయలు, పండ్లు, గోధుమ, బార్లీ మరియు మాంసం వీరి ప్రధాన ఆహారం. వీరు ఎద్దు, దున్నపోతు, గొర్రె, పంది, కుక్క, ఆవు మరియు ఒంటె వంటి జంతువులను పెంచేవారు.
వీరు రాగిని, కంచును ఎక్కువగా వంట సామాగ్రికి ఆయుధాల తయారికి కూడా వాడినట్లు త్రవ్వకాల ద్వారా తెలుస్తుంది. హరప్పా ప్రజలు అలంకారప్రియులు. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఆభరణాలు ధరించేవారు. వీరు బంగారం, వెండి, రాగి, పూసలు, ఎముకలు మరియు గవ్వలతో ఆభరణాలు తయారు చేసేవారు. కాటుక, సుగంధ లేపనాలు, పెదవులకు రంగులు కూడా వేసుకొనేవారు. వీరిలో స్త్రీలు జడలు, ముడులు వేసుకొనేవారు.
వీరు తయారు చేసిన మట్టి ముద్రికలు, శిలా విగ్రహాలు వీరి మతాన్ని తెలుపుతున్నాయి. వీరు అమ్మ తల్లిని పూజించేవారు. వీరు జంతువులను, చెట్లను మరియు సర్పాలను కూడా ఆరాధించేవారు. వీరు పశుపతి, లింగం వంటి విగ్రహాలను పూజించినట్లు చరిత్ర కారులు చెపుతున్నారు. దానికి ఆధారం ఆ విగ్రహాలేనని వారు తెలియ జేస్తున్నారు